కరువు నిన్ను SETTLE(స్థిరపరచటానికి) or SET(సరిచేయటానికి)

showcase image     ఆదికాండము 26:1,2 అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.

    చదివిన పై వాక్య భాగంలో ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినట్లు మనం గ్రహించగలం. కరువు అంటే ఏమిటి? పంటలు పండకపోవడం, వర్షాలు లేకపోవడం, తినడానికి ఆహారం లేకపోవడం, డబ్బులు లేకపోవడం అని చెప్పుకోవచ్చు. దేశాలు రాజ్యాలు కరువులో వున్నా... ఒక క్రైస్తవుడే ఆ కరువులో కూడా దేశాలను పోషించగలడు. వాక్యంలో గమనిస్తే ఆ దేశంలో కరువు వుంది. కానీ ఆ కరువుకు మనం భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే కరువు దేశానికి కానీ మనకు కాదు.
    ఇస్సాకు జీవితంలో కాక అబ్రహాము జీవితంలో కూడా కరువు వచ్చింది. "ఆదికాండము 12:10 అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను." ఇక్కడ అబ్రహాము నివసించిన ఆదేశంలో కూడా కరువు వచ్చింది కరువు దేశానికే కానీ క్రైస్తవులకు కాదు
ఎవరు క్రైస్తవులు? వాక్యంలో పరిశీలిస్తే... అపో.కార్యములు 11:26 మొట్ట మొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.       క్రైస్తవులంటేనే శిష్యులు. ఒక వ్యక్తిని చూడగానే శిష్యుడని ఎలా గుర్తుపడతారు? గురువు యొక్క సిద్ధాంతాలు పాటించేవాడే శిష్యుడు. కదా అలాగే క్రీస్తు యొక్క సిద్ధాంతాలను, ఆజ్ఞలను పాటించేవారే క్రీస్తును వెంబడిరచే శిష్యులు. ఇస్సాకు మంచి విశ్వాసవీరుడు, ఆత్మీయుడు. ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ‘‘నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము’’ అని చెప్పెను. దేవుడు ఇస్సాకును అక్కడే వుండిపోమని చెప్పిన వెంటనే అక్కడే వుండిపోయాడు విధేయత చూపాడు. కొంతమంది వారికి అన్నీ తెలుసు అనుకుంటారు ఇతరులు చెప్పినా వినరు. పోనీ ఆ విషయం తెలిసైనా వుండాలి లేదా ఇతరులు చెప్తే వినే బుద్ధి అయినా వుండాలి. అంతా తెలుసు అన్ని తెలుసు అనుకోవడం గర్వం. చెప్తే వినకపోవడం మూర్ఖత్వం. మానవుడు తనకు తాను దేవుని కంటే ఎక్కువగా ఊహించు కుంటాడు. మొదట ప్రతి విశ్వాసి తనకు ఏది తెలుసో ఏది తెలియదో గ్రహించాలి. కొంతమంది పైకి రాకపోవడానికి గల కారణం ఈ గ్రహింపు లేకపోవడమే. మనకు ఏది తెలుసో గ్రహింపు కలిగివుంటే మనకు తెలియనిది గ్రహించగలం.
     ఇస్సాకు జీవితంలో కరువు వచ్చింది. అయితే కరువులో భయం కలగడం వాస్తవమే. అయినా ఇస్సాకు మానవ ప్రయత్నాలేవి చేయక కరువులో కూడా దేవుడు చెప్పిన మాటకు లోబడి విధేయత చూపాడు అందుకే 1) నూరంతల ఫలము పొందాడు 2) క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు. మన కుటుంబాల్లో కూడా ఈరోజుల్లో ప్రేమ అనే కరువు, సమాధానం అనే కరువు, ఆప్యాయతనే కరువు, అప్పులు అనే కరువు, వ్యాధులు రోగాలు అనే కరువులు వున్నాయి. అయితే కరువు ఎందుకు వచ్చిందో మొదట మనం గ్రహించాలి. కరువు రావడానికి గల కారణాలు వెదకాలి. మాకు తెలియదు అనే గ్రహింపైన వుండాలి లేదా ఇతరులు చెప్తే వినే బుద్ధి అయిన వుండాలి. అనేక కుటుంబాల్లో ఈ కరువులు రావడానికి గల కారణం వాక్యానికి విధేయత చూపకపోవడమే. ఇస్సాకు దేవుని మాటకు విధేయత చూపాడు అందుకే కరువులో పోషింపబడ్డాడు. అబ్రహాము, ఇస్సాకులు నివసించిన ఆ దేశాలలో కరువులున్నా వారి కుటుంబాల్లో కరువు లేదు. వాళ్లు పోషింపబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. యాకోబు నివసించిన దేశంలో మరియు యాకోబు కుటుంబంలో కూడా కరువు వుంది. కొన్ని కరువులు మనల్ని సెటిల్‌ చేయడానికి (స్థిరపరచడానికి, ఆశీర్వదించడానికి) లేదా సెట్‌ చేయడానికి (సరి చేయడానికి) వస్తాయి. అబ్రహాము, ఇస్సాకుల జీవితంలో వచ్చిన కరువు వాళ్ళని సెటిల్‌ చేసింది(స్థిరపరచింది). యాకోబు జీవితంలో వచ్చిన కరువు యాకోబు ను సెట్‌ చేసింది (సరి చేసింది). ఆ కరువు మనల్ని సెటిల్‌ చేయడానికి వచ్చినా సెట్‌ చేయడానికి వచ్చినా మనం పూర్ణమనస్సుతో విధేయత చూపాలి. కుటుంబంలో ఒక్కరు దేవుని మాట వినకపోయినా కరువు వస్తుంది.
    బైబిల్‌ లో ఒక వ్యక్తిని మనం చూడగలం ఆయన పేరు యోనా. దేవుడు యోనాను దర్శించి నీనెవె పట్టణమునకు వెళ్ళమంటే యోనా తర్షీషు పట్టణానికి వెళ్లడానికి ఓడ ఎక్కాడు. దానివలన జరిగిందేమిటి? ఓడలో అంతా గలిబిలి సృష్టించబడిరది. మరలా దేవుడు రెండవసారి యోనాను దర్శించి నినెవెకు పంపిస్తాడు. ఈ పరిస్థితుల్లో యోనా సెట్‌ అయ్యాడు. కుటుంబంలో తప్పులు ఎత్తిచూపేవారు ఒక్కరు వున్న కరువు రాదు. మనలను ప్రేమించే వారే మనకు గాయాలు చేస్తారు అని మనం గ్రహించాలి.
    చివరగా బైబిల్‌ లో వున్న మరో వ్యక్తి జీవితంలో కూడా కరువు వచ్చింది. రూతు 1:1-2 న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యునిపేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి న్యాయాధిపతులు ఏలిన కాలంలో ఆ దేశంలో కరువు అని వ్రాయబడి వుంది. ఈ కుటుంబం కరువులో ఏం చేయాలి? న్యాయధిపతులు వున్నారు గనుక ఏ నిర్ణయం తీసుకోవాలో వారి వద్ద విచారణ చేసి వుండాల్సింది, వారి మాట విని వుండాల్సింది. కానీ ఈ కుటుంబం వారికున్న న్యాయధిపతుల దగ్గర విచారణ చేయకుండా వారి మాట వినకుండా మోయాబుదేశానికి కాపురం వుండుటకు వెళ్ళిరి. మోయాబీయులతో పదితరాల వరకు సాంగత్యం చేయకూడదని దేవుడు ఇంతకు మునుపే చెప్పి వుండెను.
    కరువు దేశానికి కానీ నీకు కాదు. కానీ ఈ కుటుంబం మాకంతా తెలుసు అన్నట్లు మోయాబుదేశానికి వెళ్లారు. చివరికి జరిగిందేమిటి? నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. భర్త చనిపోగానే నయోమికి ఒక ఆలోచన రావాలి కానీ రాలేదు. ఎందుకిలా జరిగింది? ఇది నా తప్పు నిర్ణయం వలననా అని. ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎక్కడ తప్పయిందో కూర్చొని ఆలోచించాలి. అలా ఆలోచన రాకపోవడానికి కూడా కారణాలు వున్నాయి అవి ఒకటి అహం, రెండు ఆత్మీయ గర్వం. జరిగిన నష్టానికి, అప్పుకు, అసమాధానానికి, రోగానికి ఎందుకిలా జరిగిందనే ఆలోచన రావాలి. చిన్న తప్పుకే పెద్ద బాధ కలగాలి. చనిపోగానే నయోమి ఆలోచన చేయకుండా దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టి తన ఇద్దరు కుమారులకు మోయాబు స్త్రీలతో వివాహం చేసింది. అంటే మనసు కఠినంగా మారిపోయింది. మనసు కఠినంగా వుంటే కుటుంబంలో ఏం జరుగుతుందో గ్రహించలేం గుర్తుపట్టలేము. నయోమి తన సొంత నిర్ణయం తీసుకుని తన భర్తను తన కుటుంబమును పోగొట్టుకుంది.
    రూతు 1:6 వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను నయోమికి బుద్ధి వచ్చి దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు వారిని దర్శించాడని విని మరల బెత్లెహేము కు తిరిగి వచ్చింది. ఎప్పుడు తిరిగి వచ్చింది అంతా పోగొట్టుకొని నష్టం కలిగినప్పుడు. అలా కాకుండా మొదటనే దేవుని మాట, న్యాయాధిపతుల మాట, నిన్ను నడిపించే దైవజనుని మాట విని అక్కడే వుంటే నష్టం కలగకపోయేది.
    కొన్ని కరువులు మనల్ని సెట్‌ చేయడానికి అని చెప్పుకున్నాం కదా ఈ కరువులో నయోమిని దేవుడు సెట్‌ చేశాడు (సరి చేశాడు). కరువు దేశానికే గాని క్రైస్తవునికి కాదు. మనం చేయాల్సింది ఒకే ఒక పని. మెత్తని మనస్సు కలిగి కరువులో దేవుడు ఏం చెప్తున్నాడో విని దానికి విధేయత చూపాలి. తప్పు ఎక్కడ జరిగిందో గ్రహించాలి. సరి చేసుకోవాలి. చివరగా ఇస్సాకు ఆ కరువులో ఆశీర్వదించబడటం చూచి శత్రువులు కూడా సాక్ష్యం చెప్పారు. మన కుటుంబాల గురించి కూడా అనేకులు సాక్ష్యం చెప్పాలని దేవుని ఆశ, దైవజనుని ఆశ. దేవుడు అట్టి కృపతో నింపును గాక..... ఆమెన్‌.
-------------------------------------------------------------------------------------------------------------------


అయ్యో! హాగరు...

showcase image

    దేవునికి మన యెడల ప్రతి దినం నూతన వాత్సల్యత పుట్టినట్లు మనతో దేవుడు ప్రతి దినం నూతనంగా మాట్లాడుతూనే వుంటాడు. మనకు తెలిసిన వాక్యమే అయినా ప్రతి దినం నూతనంగా మనల్ని దేవుడు దర్శిస్తూనే వుంటాడు. పరిశుద్ధ గ్రంథంలోని ఒక స్త్రీ గురించి మనం చూద్దాం. ఆ స్త్రీయే హాగరు. హాగరు గురించి అనేక విషయాలు మనం అనేకసార్లు విని వుంటాం అయితే హాగరు గురించి మరికొన్ని విషయాలు ఇక్కడ ధ్యానం చేద్దాం. ఆదికాండము 16:11,12 మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు.
    హాగరు తన యజమానురాలైన శారాయొద్ద నుండి పారిపోతూ వున్నప్పుడు షూరు మార్గములో దేవుని దూత ప్రత్యక్షమై నీవు గర్భవతివై వున్నావు నీకు పుట్టబోయే బిడ్డ అడవి గాడిద వంటి మనుష్యుడు అని చెబుతుంది. దూత నేరుగా నీకు అడవి గాడిద వంటి పిల్లవాడు పుడతాడు అని చెప్పినా హాగరు ఏమైనా మనసున పెట్టిందా అంటే పెట్టలేదు. నీ కొడుకు గాడిద అని అంటే అది మెప్పుకోలా? అది గొప్పనా? కానే కాదు. హాగరు మాత్రం ఈ మాటలు చెవిన పెట్టలేదు. నీకు పుట్టబోయే బిడ్డ ఇలాంటి వాడు అని చెప్తే అదొక రీమార్కే కదా! అది తెలిసి కూడా హాగరు ఆ మాటలు మనసున పెట్టలేదు. వాస్తవానికి పుట్టక మునుపే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ హాగరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు.
    యోహానును బట్టి స్త్రీలు నీ గర్భం ధన్యమైనదని యోహాను యొక్క తల్లిని కొనియాడారు. మన పిల్లలు మంచి ఉన్నత స్థితిలో వున్నప్పుడే కదా తల్లిదండ్రులుగా మనం సక్సెస్‌ అయ్యేది. హాగరు మాత్రం తనకు పుట్టబోయే కుమారుడు ఇలా అని తెలిసినా ఏం జాగ్రత్తలు తీసుకోలేదు. దూత హాగరుకు ఒక అవకాశం ఇచ్చింది. తన యజమానురాలి చేతి క్రింద అణిగి వుండమని. కానీ హాగరు ఆ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేక పోయింది.
    వాక్యంలో మనం గమనిస్తే ఆదికాండము 21:20 దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. ఈ తల్లి తన కుమారున్ని అరణ్యంలో పెంచింది. దేవుడు తోడై యున్నాడు సరే కానీ తన కుమారున్ని ఎక్కడ పెంచాలి? అబ్రహాము గుడారంలో పెంచాలి. హాగరు శరీర సంబంధమైన వాటికే ఏడ్చింది కానీ ఆత్మసంబంధమైన వాటి కొరకు ఏడ్వలేదు. దేవుని వాక్యం చెప్పినట్లు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఈ హాగరు శరీర విషయాల మీదనే తన మనస్సు వుంచింది. అందుకే అపోస్తులుడైన పౌలు హాగరును శరీరానుసారిగా పోల్చాడు. అరణ్యం అంటే లోకం లోకమే ఒక అరణ్య భూమి. హాగరు తన కుమారున్ని లోకంలో పెంచింది లోకంలో వున్నదంతయు శరీర సంబందమే కదా.
    హాగరును శరీరానుసారి అని ఎలా గుర్తుపడతాం? అబ్రహాము ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు నీ భార్య అయిన శారాయి ఎక్కడుంది అని అడుగుతారు. అందుకు అబ్రహాము ‘‘గుడారంలో వుంది’’ అని జవాబు ఇస్తాడు. అంటే ఆత్మసంబంధులు గుడారంలోనే వుంటారు కానీ శరీర సంబంధులు గుడారంలో వుండక లోకములో వుంటారు. శారా ఈ పిల్లలు లేని స్థితిలో కూడా గుడారంలోనే వుంది. ఆత్మానుసారమైన తల్లి తన పిల్లలను ఆత్మానుసారముగా, శరీరానుసారమైన తల్లి తన పిల్లల్ని శరీరానుసారంగా పెంచుతుంది. శార ఆత్మసంబంధమైనది కాబట్టి ఇస్సాకు ఆత్మసంబంధుడిగా పెరిగాడు. ఇస్సాకు వాక్య ధ్యానంలో, ప్రార్థనలో తల్లిదండ్రులకు లోబడుతూ పెరిగాడు. హాగరు కష్ట స్థితిలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు హాగరు కోసం నీళ్ల ఊటనే ఇచ్చాడు. కానీ హాగరు దేవునికి ఏమీ ఇవ్వలేదు కనీసం తన కుమారున్ని దైవీకముగా పెంచలేకపోయింది. శరీరానుసారులు దేవునికి ఏమీ ఇవ్వరు.
    ఇష్మాయేలు పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఒక పరిణితి వచ్చింది. ఈ లోకంలోని విషయాలపై ఆరితేరాడు. దీనంతటికీ కారణం తల్లేకదా. ఎందుకంటే తల్లే కదా పెంచింది! హాగరుకు కొంచమైనా వాక్యం గుర్తు రాలేదా? అరణ్యంలోనే కొడుకు పెరిగి పెద్దవాడై కాపురం వున్నాడు. కాపురం వుంటే తినడం, తాగడం, మాట, ప్రవర్తన అన్ని అరణ్యంలోనే అంటే లోకంలోనే. మొత్తం శరీరానుసారిగా మారిపోయాడు. దైవభక్తి కొంచమైనా లేదు. వాక్యంలో చూస్తే హాగరు అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను అని వ్రాయబడి వుంది. అంటే హాగరు తనకు వచ్చిన సమస్యలకు పరిష్కారం లోకానుసారంగా మాత్రమే ఆలోచించింది.
    నీవు ఆత్మీయురాలివైతే నీ సమస్యలకు పరిష్కారం ఆత్మానుసారం గానే కనుగొంటావు. పరిష్కారం వాక్యానుసారమా కాదా అని కూర్చుని ఆలోచించాలి. వాక్యానికి వ్యతిరేకముగా పరిష్కారం వస్తే అది అపవాది నుండి లేదా ఇరుగుపొరుగు వారి నుండి వచ్చినట్లు లెక్క. నీ ఇంట్లోని కుటుంబ సభ్యుల ద్వారా నీవు పరిశుద్ధురాలివి అని సాక్ష్యం పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే వచ్చిన సమస్యలను నీవు ఎలా పరిష్కరిస్తున్నావో దాన్ని బట్టే సాక్ష్యం వస్తుంది.
    యోబు 39:5 అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? అడవి గాడిదకు కట్లు లేవు ఆ రీతిగానే ఈ హాగరు కుమారుడైన ఇష్మాయేలుకు కూడా కట్లు లేవు. ఈ తల్లి ఆ రీతిగా తన కుమారున్ని పెంచింది. అరణ్యంలోనే పెరుగుతూ, అరణ్యంలోనే కాపురముండి, ఇష్టం వచ్చినట్లుగా, స్వేచ్ఛగా తిరుగాడుతున్నాడు ఇష్మాయేలు. ఇంకా అరణ్యంలో వీలుకాడాయెను అని వ్రాయబడి వుంది. విలుకాడు అంటే వేటగాడు అని అర్థం. అంటే చూసిందల్లా కావాలని కోరుకోవడం అని. ఈ ఇష్మాయేలుకు భూ సంబంధమైన వేట తెలుసు, లోకంలో తాను చూసిందల్లా పొందుకునే వరకు విడువడు.
    అలాగే కొందరికి ఎప్పుడూ లోకమే. లోకంలో ఏ వేట వుంటుంది? కొంతమందికి పదవి వేట, మరికొంతమందికి అందం వేట, ఇంకా కొంత మందికి డబ్బు వేట, కొందరికి తినడం త్రాగడం, అనవసరమైన వాటి కొరకు ఖర్చు చేసే వేట వుంటుంది. కానీ దేవుని బిడ్డలుగా ప్రతీ విశ్వాసికి వుండాల్సింది ఈ భూ సంబంధమైన వేట కాదు కాని వాక్యపు వేట, ఆత్మసంబంధమైన వేట వుండాలి. ఒక గవిని వెతికినట్లు దేవుని వాక్యాన్ని వెదకాలి. దేవుడు ఏ కూటములో ఏం మాట్లాడతాడో, ఎలా దేవుని వాక్యం దర్శిస్తుందో అని ఆశ కలిగి మనం వుండాలి. ఆ రీతిగా మన పిల్లల్ని పెంచాలి.
    ఆదికాండము 21:21 అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తుదేశమునుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లిచేసెను. ఇక్కడ హాగరు లోకస్తురాలైన తల్లి లాగానే వుంది. ఆత్మీయురాలైన స్త్రీని తెచ్చి పెండ్లి చేయాలి కానీ లోకానుసారమైన స్త్రీని తెచ్చి పెండ్లి చేసింది. ఇష్మాయేలు పూర్తిగా లోకానుసారిగా మారడానికి కారణం ఈ తల్లే. నిజానికి హాగరు ఐగుప్తీయురాలే అంటే లోకస్తురాలే. దేవుడు హాగరును కనికరించి లోకంలో నుండి వేరుచేసి అబ్రహాము గుడారంలో చేర్చాడు. అయితే ఈ హాగరు ఆ గుడారాన్ని విడిచి, వాక్యాన్ని విడిచి మరలా లోకంలోనీకే వెళ్ళింది.
    ఒకప్పుడు లోకస్తులుగా బ్రతుకుతున్న మనల్ని దేవుడు కనికరించి తన రక్తముతో కడిగి సంఘములో నాటితే మనం ఆ సంఘాన్ని, వాక్యాన్ని విడిచి మరల లోకస్తులుగా మారకూడదు. తల్లి శరీరానుసారిగా వుంటే పిల్లలు శరీరానుసారముగానే వుంటారు. ఈ తల్లి తన చేతులారా తన కొడుకుని అలా మార్చింది. హాగరు తన కొడుకుని గురించి అబ్రహామును వేడుకుంటే తప్పించే వాడేమో. శరీర సంబంధులకు ఏది మంచో ఏది చెడో ఆలోచించే వివేకం వుండదు. నీ కొడుకు గాడిద అని చెప్పినప్పుడే దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆ దేవుడు వినేవాడు కాదా? ఖచ్చితంగా వినేవాడు! కానీ హాగరు అంత తీవ్రంగా ఆ మాటలను గురించి ఆలోచింపలేదు.
    గొప్ప దైవజనుడు మిషనరీ అయిన జాన్‌ వెస్లీ గారి తల్లికి పదహారు మంది సంతానం ఈ పదహారు మందిలో ప్రతివారు లోకానుసారముగా బ్రతుకుతూ వుంటే ఆ తల్లి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి తన పిల్లల్ని మార్చుకుంది. హాగరుకు ఆ భారం లేదు. శరీర సంబంధులకు అలాంటి భారం వుండదు. అలాంటి వారు మనల్ని నడిపించే ఆత్మీయ తండ్రి ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా వారిది వారే, వారి మనస్సుకు నచ్చిందే చేస్తారు.
     ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడియున్నవి. మనము బుద్ధి కలిగి హాగరు వలె లోకస్తురాలిగా కాకుండా మన పిల్లల నిమిత్తమై దేవుని సన్నిధిలో ఏడ్చి ఆత్మ సంబంధులుగా బ్రతుకుదుము గాక. బహు భయంకరముగా వున్న ఈ లోకంలో మనము ఆత్మ సంబంధులుగా, పరిశుద్ధులుగా మనం మన పిల్లల్ని పెంచుదుము గాక. అట్టి కృప ప్రభువు మనకు దయచేయును గాకా... ఆమెన్‌.!.

Kadaburadhwani - eMagazine

  • infoAbout

        KADABURA DWANI is a Christian Spiritual Monthly Magazine Published by Pastor. B.S. Benher of The Holy Mountain Ministries, Adilabad, Telangana.   The mission of the magazine is "to help people from all walks of life to achieve their maximum personal and spiritual potential."

  • history_edu Editorial
  • menu2024
    arrow_rightSeptember
    arrow_rightAugust
    arrow_rightApril
    arrow_rightFebruary
    arrow_rightJanuary